హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద ముంపులో రోశయ్య ప్రభుత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వాన్ని వరద ప్రమాదం తీవ్ర ఇరకాటంలో పెట్టే ప్రమాదం ఉంది. వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమనే విషయం బయటపడుతోంది. శ్రీశైలం నుంచి సకాలంలో నీటిని దిగువకు విడుదల చేయకపోవడం వల్ల, కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం వల్ల వరద ప్రమాదం సంభవించిందని కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాని తూర్పూర బట్టారు. ఈ స్థితిలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఇరకాటంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన ఓ వార్తాకథనం స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని అంటున్నారు. ఈ వార్తాకథనం తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో వరద ప్రమాదం గురించి సిడబ్ల్యుసి అధ్యక్షుడు అరుణ్ కుమార్ బజాజ్ ఇంటర్వ్యూను ఆ పత్రిక ప్రచురించింది. ఆయన చెప్పిన విషయాలు ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేసే విధంగా ఉన్నాయి. తాము 26 గంటల ముందే ప్రమాదం గురించి తెలియజేశామని ఆయన చెప్పారు. అప్పటికి నాగార్జున సాగర్ జలాశయంలో 55 శాతం ఖాళీగా ఉందని, వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలాల్సిందని ఆయన అన్నారు. తాము ముందుగానే హెచ్చరించామని ధృవీకరించడానికి ఆయన తాము రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలను ఆ పత్రికా ప్రతినిధికి చూపించారు. శ్రీశైలం గేట్లు వారు ఎప్పుడు ఎత్తేరో తమకు తెలియదని, దీనిపై నివేదిక కోరుతామని ఆయన అన్నారు.

నిజానికి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గేట్లు ఎత్తారు. ఆయన గేట్లు ఎత్తిన ఫొటోలు, వార్త మీడియాలో వచ్చాయి కూడా. అయితే ఆ వెంటనే వాటిని మూసేయించారు. వాటిని ఎవరి ఆదేశాల మేరకు మూసేశారని మాత్రం తెలియదు. అలా మూసేసిన వార్త కూడా మీడియాలో వచ్చింది. దీంతో ప్రమాదం వైఫల్యం మొత్తం పొన్నాల లక్ష్మయ్య మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పొన్నాలను సవాల్ చేశారు కూడా. పొన్నాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద, రోశయ్య ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X