హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఖమ్మం జైలు నుంచి తరలించబోమని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ఖమ్మం జైలులో కెసిఆర్ కు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి కె. రోశయ్య వాకబు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె చెప్పారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి నుంచి వైద్యుల బృందాన్ని పంపించామని, వారి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
కెసిఆర్ కు చికిత్స అందించడానికి ఖమ్మంలో సరైన సౌకర్యాలు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని కూడా వైద్యుల బృందం నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. వైద్యుల నివేదిక అందిన తర్వాత ఏం చేయాలనేది చూస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఆందోళనలో అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే తాము కెసిఆర్ నిరాహార దీక్ష చేపట్టవద్దని, బంద్ పాటించకూడదని తాము తెరాసను కోరినట్లు ఆమె తెలిపారు. చిన్న పాటి సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగానే జరిగిందని ఆమె చెప్పారు.