హైదరాబాద్: ఖమ్మం ఆస్పత్రిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె.చంద్రశేఖర రావును కలవడానికి న్యాయవాదులు కలుసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కెసిఆర్ నిర్బంధంపై తెలంగాణ న్యాయవాదులు వేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యాదులు కెసిఆర్ చెంత ఉండవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. కెసిఆర్ చెంత ఆయన కుటుంబ సభ్యులను ఉండనివ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. కెసిఆర్ నిర్బంధం అక్రమమంటూ సత్యంరెడ్డి అనే న్యాయవాది హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ఆదేశాలతో కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు, ఆయన మేనల్లుడు, శాసనసభ్యుడు హరీష్ రావు ఆయన వద్దకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో తాము కెసిఆర్ వద్దకు వెళ్తున్నట్లు కె.టి. రామారావు అంతకు ముందు ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాత్రి కెసిఆర్ గదికి పక్క గదిలో కెమెరా కనిపించిందని, దాన్ని కనిపెట్టి పోలీసు అధికారి పరిమళకు ఇచ్చామని, మరోసారి పోలీసులు కెసిఆర్ పై కుట్ర చేసేందుకే ఆ విధమైన ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. అది తమ కెమెరా కాదని పరిమళ చెప్పారని ఆయన అన్నారు.