కె చంద్రశేఖర రావు పట్టుదలతో ఉన్నారు: చుక్కా, పొత్తూరి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తన నిరాహార దీక్ష విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పట్టుదలతో ఉన్నారని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు చెప్పారు. కెసిఆర్ చాలా నీరసంగా ఉన్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ ను కలిసిన అనంతరం వారు గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము కెసిఆర్ తో మాట్లాడామని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై ముందుకు రావాలని, అప్పుడే దీక్ష విరమిస్తానని అంటున్నారని వారు చెప్పారు. తాము రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతామని ఆయన అన్నారు. కెసిఆర్ దీక్ష ఇదే విధంగా కొనసాగితే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో తాము నిర్ణయించుకుంటామని వారు చెప్పారు.
కెసిఆర్ కు ఏమైనా జరిగితే ప్రత్యేక రాష్ట్రం కోసం కాదు, ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తామని తెలంగాణ విమోచన సమితి అధ్యక్షుడు వి. ప్రకాష్ చెప్పారు. ఆయన కూడా కెసిఆర్ ను పరామర్శించారు. కెసిఆర్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. నిజామాంధ్రను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే పిటిషన్ ఐక్య రాజ్య సమితి ముందు ఉందని ఆయన అన్నారు. బలవంతంగా ఇండియన్ యూనియన్ లో కలుపుకుని తమను మోసం చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ ను బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా పరామర్శించారు. తాను తమ అగ్రనేత అద్వానీతో మాట్లాడినట్లు తెలిపారు. బిజెపి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, పార్లమెంటులో బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందని ఆయన చెప్పారు.