మోదీ పసిడి మంత్రం: పాత బంగారంతోనే కొత్త వెలుగులు!
ఇండియాలో బంగారం అంటే కేవలం ఓ లోహం కాదు.. అది సంస్కృతి, సెంటిమెంట్, కుటుంబాల ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న ఓ అమూల్యమైన ఆస్తి. అయితే ప్రస్తుతం దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో సుమారు 32,000 టన్నుల బంగారం(దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్ల విలువైనది) ఎటువంటి ఉపయోగం లేకుండా లాకర్లలో, బీరువాల్లో మూలన పడి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే దేశంలోనే నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
బంగారం రీసైక్లింగ్ అంటే పాత లేదా విరిగిపోయిన ఆభరణాలు, నాణేలు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి బంగారాన్ని సేకరించి దానిని కరిగించి శుద్ధి చేయడం ద్వారా మళ్లీ 99.9 శాతం స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారంగా మార్చాడం. ముత్తూట్ ఎగ్జిమ్ సీఈవో కేయూర్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతునంది. కొత్త బంగారాన్ని మైనింగ్ చేయడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అదే రీసైక్లింగ్ ద్వారా అయితే సహజ వనరులను కాపాడుకుంటూనే అవసరాలను తీర్చుకోవచ్చు.

ప్రభుత్వం ఈ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రధాన కారణం దేశంపై పడుతున్న భారీ ఆర్థిక భారమే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా తన బంగారపు అవసరాల కోసం ఏకంగా 72.4 బిలియన్ డాలర్లను ఖర్చు చేసి విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. మనం రీసైక్లింగ్ చేసే ప్రతి గ్రాము బంగారం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భారాన్ని అంత మేర తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశంలో ఉన్న మొత్తం బంగారంలో కేవలం ఒక్క శాతం బంగారాన్ని ప్రతి ఏటా రీసైక్లింగ్ చేసినా.. ఇండియా బంగారపు దిగుమతులు దాదాపు 25 నుంచి 33 శాతం వరకు తగ్గిపోతాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్', ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి ద్వారా లాకర్లలో నిద్రపోతున్న ఈ సంపదను బయటకు తీసి, దేశీయంగా ఒక బలమైన సప్లై చైన్‌ను నిర్మించాలని విధానకర్తలు భావిస్తున్నారు.
సాధారణంగా భారతీయులు బంగారాన్ని ఓ సురక్షితమైన పెట్టుబడిగా, ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా భావిస్తారు. అందుకే తరాల తరబడిగా వివాహాలు, పండుగల ద్వారా వచ్చిన పాత ఆభరణాలను అలాగే దాచి ఉంచుతారు. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం, జ్యువెలరీ సంస్థలు ఎటువంటి తరుగు లేకుండా పాత బంగారానికి బదులుగా కొత్త డిజైన్లను ఆఫర్ చేస్తుండటంతో, ప్రజలు పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేయడానికి, ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి మక్కువ చూపుతున్నారు.












Click it and Unblock the Notifications