హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారంనాడే చిరంజీవికి అందజేసినట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి ఆయన జై ఆంధ్ర ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
పార్టీలు మారడం హరిరామ జోగయ్యకు అలవాటేనని రాష్ట్ర ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. హరిరామ జోగయ్య రాజీనామాతో చిరంజీవికి మరో షాక్ తగిలింది.