హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల వద్దకు వెళ్లకుండా వారిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ ఇద్దరు శాసనసభ్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల వద్ద బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చెసి సికింద్రాబాదులోని బోయినపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.
విద్యార్థులను పరామర్శించడానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమతి ఇచ్చినా పోలీసులు అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నేతలను అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరీష్ రావు హెచ్చరించారు. క్యాంపస్ లో పోలీసు బలగాలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. లాఠీచార్జీలు, అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని ఆయన అన్నారు.