హైదరాబాద్: తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తెలంగాణకు చెందిన తాము ముందుకు వచ్చామని, ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నామని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి అన్నారు. నిరాహార దీక్షను విరమించాలని ఆయన కెసిఆర్ ను కోరారు. మరో మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డితో కలిసి ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన పది మంది మంత్రులు, కాంగ్రెసుకు చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు, 14 మంది ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని, తాము 29 మంది కాంగ్రెసు శాసనసభ్యులం నేడు లేఖ రాస్తున్నామని ఆయన చెప్పారు. 25 మంది కాంగ్రెసు శాసనసభ్యులతో సంతకాలతో సోనియాకు వినతి పత్రం సమర్పిస్తున్నామని, మరో నలుగురు శాసనసభ్యులు పోన్ ద్వారా తమ అంగీకారం తెలిపారని ఆయన అన్నారు. ఇంత మందిమి తెలంగాణ కోసం నిలబదడుతున్నందున కెసిఆర్ దీక్ష విరమించుకోవాలని ఆయన కోరారు.
విద్యార్థులపై పోలీసు చర్యను ఆయన ఖండించారు. విద్యార్థులు తమ చలో ముట్టడి కార్యక్రమాన్ని శాంతిర్యాలీగా మార్చుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ఆయన చెప్పారు. విద్యార్థులకు అన్ని రకాలుగా తాము అండగా నిలబడుతామని ఆయన చెప్పారు. విద్యార్థులు విధ్వంసానికి దిగవద్దని, దాడులకు పాల్పడవద్దని ఆయన కోరారు. అన్ని వైపుల నుంచి తెలంగాణ ఉద్యమానికి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు. తాము 2001లోనే 41 మంది శాసనసభ్యులం ప్రత్యేక తెలంగాణ కోసం సోనియాకు వినతి పత్రం సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.