హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాగుతున్న ఉద్యమంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య కఠినమైన ప్రకటన చేశారు. ఉద్యమం వెనక ఎవరున్నారో తెలుసునని, ఎవరినీ వదిలి పెట్టబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తాను ఢిల్లీలో తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి గానీ అధిష్టానం దృష్టికి గానీ తీసుకు రావడం లేదని, సోనియాకు శుభాకాంక్షులు తెలిపేందుకు మాత్రమే తాను ఢిల్లీ వెళ్తున్నానని ఆయన చెప్పారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఉద్రిక్తతలు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించాలని ఆయన అన్నారు.
ఆ తర్వాత రోశయ్య చాలా వరకు తగ్గి మాట్లాడారు. తెలంగాణ చాలా సున్నితమైన వ్యవహారమని, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన ఆ తర్వాత అన్నారు. అవకాశం వస్తే తెలంగాణ గురించి సోనియాతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. తెలంగాణకు పరిష్కారం కనుక్కోకపోతే మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని ఆయన అన్నారు. సమస్యను అందరి దృష్టికి తీసుకు రావడంలో కెసిఆర్ విజయం సాధించారని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత వ్యవధి కావాలని ఆయన అన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు. కెసిఆర్ పట్టుదలకు పోకుండా దీక్ష విరమించాలని ఆయన కోరారు.