హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీల్లో కాంగ్రెసు శాసనసభ్యులు బుధవారం ఉదయం వాగ్వివాదానికి దిగారు. మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. సభ వాయిదా పడిన తర్వాత తెలంగాణేతర ప్రాంతాల కాంగ్రెసు శాసనసభ్యులు జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేశారు. దీనికి ఆర్ దామోదర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలంగాణకు చెందిన తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మౌనంగా ఉన్నప్పుడు మీరేందుకు నినాదాలు చేస్తున్నారని ఆయన అడిగారు. శాసనసభ్యులను విఫ్ లు అదుపు చేయడం లేదని ఆయన విమర్శించారు. దీనికి విప్ భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమావేశాలు పెట్టి మీరే రెచ్చగొడుతున్నారని విక్రమార్క అన్నారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. కాగా, సభ రెండోసారి అరగంట పాటు వాయిదా వడింది.
తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తెలంగాణకు మించిన ప్రధానమైన అంశం ఉండదని వారన్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రెండోసారి అర గంట పాటు సభను వాయిదా వేశారు. మొదటి సారి కూడా కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రెండో సారి వాయిదా వేసిన తర్వాత స్పీకర్ ఫ్లోర్ లీడర్లను చర్చలకు ఆహ్వానించారు.