హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అర్థరాత్రి ఏకపక్షంగా తన నిర్ణయాన్ని ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణపై ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపడిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు పెట్టుబడులు రాకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో అందరితో పాటు తాము కూడా విఫలమైనట్లు ఆయన తెలిపారు. సమస్య జఠిలం కావడం వల్లనే ఎవరి ప్రమేయం లేకుండా రాజీనామాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు కూడా కేంద్ర ప్రకటన వల్లనే రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలను విస్మరించి శాసనసభ్యులు రాజీనామాలు చేసే పరిస్థితి వచ్చిందని, గత పాతికేళ్లుగా క్రమశిక్షణతో ఉన్న తమ పార్టీ చీలిపోయే ప్రమాదం తలెత్తిందని ఆయన అన్నారు. కాంగ్రెసు తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీల్లో విభేదాలు వచ్చాయని ఆయన అన్నారు.
తెలంగాణపై నిర్ణయం విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యను అవమానించారని, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ కూడి ఏకపక్ష తెలంగాణ ప్రకటన చేశారని, కనీసం ముఖ్యమంత్రికి కూడా అసలు విషయం చెప్పలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కూడా విశ్వాసంలోకి తీసుకోలేదని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రకటన వల్ల తమ శాసనసభ్యులపై ప్రజల ఒత్తిడి పెరిగి రాజీనామాలు చేశారని ఆయన సమర్థించుకున్నారు. శాసనసభను అర్థాంతరంగా వాయిదా వేయడం బాధాకరమని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటి వరకు పది మంది మరణించారని ఆయన చెప్పారు. సమస్యను సృష్టించింది కాంగ్రెసు పార్టీయేనని, దాన్ని కాంగ్రెసు పార్టీయే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాము చర్చించి ఒకటి రెండు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా సున్నితమైన అంశంపై తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. యుపిఎలోని మంత్రులతో చర్చించకుండానే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి