విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, తమ పార్టీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పేరు పెట్టుకున్న చంద్రబాబు సమైక్యాంధ్రపై తన వైఖరి చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని స్వర్గీయ ఎన్టీరామారావు పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారని, రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చడానికి ప్రయత్నించారని, అలా చేసి ఉండినా బాగండేదని ఆయన అన్నారు. తెలంగాణగా రాష్ట్రం పేరును మార్చినా అభ్యంతరం లేదని, అలా మారిస్తే సమస్యే ఉండదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వల్లనే తమ పార్టీ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. మతపరమైన వ్యాఖ్యల వల్ల శ్రీనివాస్ ఓడిపోవడమే కాకుండా దాని ప్రభావం మూడు జిల్లాలపై పడాలని ఆయన అన్నారు. తాను చేస్తున్న వ్యాఖ్యలను శ్రీనివాస్ దయచేసి వినాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
తాను చేసిన సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. తెలంగాణ, తెలంగాణేతర ప్రాంతాల అభివృద్ధిని చెప్పడానికి ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. తాను తెలంగాణలో కూడా సేవా కార్యక్రమాలు చేశానని ఆయన చెప్పారు. నిజాం పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనకబడి పోయిందని, తెలంగాణేతర ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ అసమానతలు చాలా వరకు తగ్గాయని ఆయన చెప్పారు. హైదరాబాదు ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని కాబట్టి హైదరాబాదుకు అందరూ వెళ్తారని ఆయన చెప్పారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కానని, తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే వ్యతిరేకినని ఆయన చెప్పారు. తెలంగాణ అనుకూలుడిగా ఆ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తానని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బుల సంచుల్లోంచి పుట్టిందనే వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఈ ఉద్యమం తెలుగు తల్లి గర్భసంచీలోంచి పుట్టిందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి