దావూద్ ఇబ్రహీం - మందాకిని జీవితంలో చీకటి కోణాలు
80వ దశకంలో 'రామ్ తేరీ గంగా మైలీ' చిత్రంతో మందాకిని రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఒక్క సినిమా ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సింహాసనం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి తెలుగువారికి కూడా చేరువైంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాయి. 1990వ దశకంలో బాలీవుడ్‌ను వణికించిన అతిపెద్ద వివాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
షార్జా ఫోటోలతో మలుపు తిరిగిన జీవితం
మందాకిని జీవితాన్ని మలుపు తిప్పింది షార్జాలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్. ఆ స్టేడియంలో దావూద్ ఇబ్రహీం పక్కన ఆమె కూర్చున్న ఫోటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటికే బాలీవుడ్‌పై అండర్‌వరల్డ్ పట్టు ఉండటంవల్ల ఈ ఫోటోలు ఆమె కెరీర్‌కు శాపంగా మారాయి. వీరిద్దరికీ వివాహం జరిగిందని, ఒక బాబు కూడా ఉన్నాడంటూ అప్పట్లో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ వివాదాల ప్రభావం మందాకిని కెరీర్‌పై తీవ్రంగా పడింది. దావూద్‌తో సంబంధం ఉందనే అనుమానంతో అగ్ర నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి భయపడ్డారు. దీనికి తోడు 1993 ముంబై పేలుళ్ల తర్వాత పోలీసులు అండర్‌వరల్డ్ లింకులపై విచారణ వేగవంతం చేయడంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలా స్టార్‌డమ్‌ను ఆస్వాదించాల్సిన మంచి సమయంలోనే ఆమె వెండితెరకు దూరమవ్వాల్సి వచ్చింది.

అండగా నిలిచిన కుటుంబం
దావూద్‌తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని మందాకిని ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. కేవలం సామాజిక కార్యక్రమాల్లో మాత్రమే అతడిని కలిశానని, అది డేటింగ్ కాదని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట సమయంలో తన కుటుంబం తనకు కొండంత అండగా నిలిచిందని, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి వారు ఎంతో సహాయం చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రజలు తన పేరును ఆ భయంకరమైన సంఘటనతో ముడిపెట్టడం ఇప్పటికీ ఆమెను బాధిస్తూనే ఉంది. సినిమాలకు దూరమైన తర్వాత మందాకిని ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. దలైలామా శిష్యురాలిగా మారి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గతంలో బౌద్ధ సన్యాసిగా పనిచేసిన డాక్టర్ కగ్యుర్ టి. రిన్‌పోచే ఠాకూర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె గ్లామర్ ప్రపంచానికి దూరంగా, తన భర్త, పిల్లలతో కలిసి ముంబైలో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మళ్లీ వెండితెరపై కనిపించే ఉద్దేశం తనకు లేదని ఆమె ఖరాకండిగా తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications