తిరుపతి: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణ, ఇతర వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపడానికి ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కలిసి ఉండి అభివృద్ధి దిశగా అడుగు వేయాలనేది తన ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కొందరు నాయకులు స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే అందుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పెల్లుబుకిందని, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభీష్టం మేరకు తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అభివృద్ధికి సంబంధించిన సమస్య అని చెప్పడంతో తాను తొలుత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని, మెజారిటీ ప్రజానీకం అందుకు విరుద్దంగా ఉన్నారని తెలియడంతో వైఖరిని మార్చుకున్నానని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి