హైదరాబాద్: తమ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డిపై దాడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పనే అని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. తమపై దాడికి తెరాస నాయకులు కుట్ర చేశారని ఆయన అన్నారు. నాగంపై దాడి జరిగన నేపథ్యంలో తెలుగుదేశం సభ్యులు సమావేశమై రాజకీయ పార్టీల జెఎసిలో చేరాలా, వద్దా అనే విషయంపై చర్చించారు. తాజా సంఘటన నేపథ్యంలో జెఎసిలో చేరకూడదని ఎక్కువ మంది శాసనసభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి నిరసనగా వారు ఆ తర్వాత శాసససభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోబోమని ఆయన చెప్పారు. తమ పార్టీ బలంగా ఉంది కాబట్టే కాంగ్రెసుకు తెరాస దూరమై తమపై కుట్ర చేసిందని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే తాము బలపరుస్తామని స్పష్టంగా చెబుతున్నామని ఆయన అన్నారు. తమపై దాడి చేసినవారు తెరాసకు చెందినవారేనని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి