టిడిపి ఓటు తెలంగాణకే, దీక్ష మాత్రం చేయలేను: ఎర్రబెల్లి
Districts
oi-Santaram
By Santaram
|
వరంగల్: తెలంగాణ డిమాండ్ కు తెలుగుదేశం కట్టుబడి ఉందని, తాను ఆరోగ్య కారణాల వల్ల దీక్షలో కూర్చోలేనని ఆ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణ సాధనోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాకతీయ యూనివర్సిటీలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు ఆమరణ దీక్షలకు పూనుకున్నారు. కేయూ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థుల్లో 8 మంది సోమవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. కేయూ అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ టీ దయాకర్‌రావు, పాలకమండలి సభ్యులు సీతారాంనాయక్ విద్యార్థుల దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు.
ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) దీక్ష శిబిరం సందర్శించి మద్దతు ప్రకటించారు. అయితే కొందరు విద్యార్థులు ఆమరణ దీక్షలు చేయాలని వారిని కోరారు. వెంటనే సీతక్క స్పందించి ఆమరణ దీక్షను అక్కడే ప్రారంభించారు. రేపటి నుంచి ములుగులో దీక్ష కొనసాగిస్తానన్నారు. బీపీ షుగర్ ఉన్నందున ఆమరణ దీక్ష చేయలేనని దయాకర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దయాకర్‌రావును ఎస్‌వీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్‌రెడ్డి ప్రశ్నించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి