విడుదలైన మానవమృగం: అనూషకు ప్రాణహాని!

రాజేష్ స్థానిక లలితానగర్‌కు చెందిన అనూష అనే యువతిని ప్రేమించానని వెం టబడేవాడు. ఆమె తిరస్కరించడంతో కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. గత సెప్టెంబరు 17న అనూష ఇంటికి వెళ్లాడు. కత్తితో ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అడ్డొచ్చిన ఆమె తల్లితండ్రులు శ్రీనివాస్, సత్యవతిలను విచక్షణారహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన సత్యవతి అక్కడిక్కడే మరణించగా శ్రీనివాస్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానికులు రాజేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు రాజమండ్రి వచ్చి అనూషను పరామర్శించారు.
అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ప్రేమోన్మాది రాజేష్‌ను రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు సెప్టెంబర్ 17నే అరెస్టు చేసి మూడో అదనపు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అరెస్టైన మరుసటి రోజే రాజేష్ బెయిల్ కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు. పలు దఫాలుగా వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో హాజరై.. సంతకం చేయాలని షరతు విధించారు.
మంగళవారం రాత్రి విడుదలైన వెంటనే రాజేష్ రాజమండ్రిలోని లకీ థియేటర్ సమీపంలోని తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కొద్దిసేపటికే అదృశ్యమయ్యాడు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు.. 'నేను విడుదలైన వెంటనే అనూషను చంపేస్తా' అంటూ రాజేష్ బాహాటంగానే బెదిరించాడు. విడుదలైన వెంటనే అతడు అదృశ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications