గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి కోపమొచ్చింది. నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమ వినతిపత్రం తీసుకోవాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. కలెక్టర్ రామాంజనేయులు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆయన శాంతించారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ధరలను అదుపు చేయాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు చిరంజీవి నేతృత్వంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర అనంతరం కలెక్టర్ రామాంజనేయులుకు వినతిపత్రం సమర్పించాలని చూశఆరు. అయితే ఆయన అందుబాటులో లేరు. దాంతో చిరంజీవికి కోపమొచ్చింది.
తాము వస్తున్న విషయం తెలిసి కూడా కలెక్టర్ లేకపోవడం పట్ల చిరంజీవి మండిపడ్డారు. ఆగ్రహంతో ధర్నాకు దిగారు. ఐజి కిషోర్ వచ్చి వినతిపత్రం స్వీకరిస్తానని చెప్పారు. అయితే వారు వినలేదు. చివరకు కలెక్టర్ రామాంజనేయులు వచ్చి చిరంజీవికి క్షమాపణ చెప్పారు. దాంతో చిరంజీవితో పాటు కార్యకర్తలు శాంతించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి