హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి మరణం ద్వారా తాను మంచి మిత్రుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఆయన బుధవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ తో కలిసి గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుమ్మడితో తనకు గల సాన్నిహిత్యాన్ని ఆయన నెమరేసుకున్నారు. తామిద్దరం తరుచూ కలిస్తుండేవాళ్లమని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు గుమ్మడి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు తెలియలేదని ఆయన చెప్పారు.
గుమ్మడి మహానటుడని ఆయన కొనియాడారు. తెలుగు సినీరంగంలో గుమ్మడికి ప్రత్యేక స్థానం ఉందని, ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని ఆయన అన్నారు. ఏ పాత్ర పోషించినా గుమ్మడి ఔచిత్యవంతంగా చేసేవారని ఆయన ప్రశంసించారు. గుమ్మడి సంభాషణల తీరును ఆయన కొనియాడారు. గుమ్మడి సంభాషణలు అత్యంత స్పష్టంగా ఉండేవని ఆయన అన్నారు. తనకు చిన్ననాటి నుంచి గుమ్మడి మంచి మిత్రుడని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి