విశాఖపట్నం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో సీమాంధ్ర యూనివర్సిటీల విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ సమైక్యాంధ్ర పతాకాన్ని ఎగురవేసింది. జగదాంబ సెంటర్ లో ఉదయం పది గంటలకు జాతీయ పతాకంతోపాటు దీన్ని కూడా ఆవిష్కరించారు. ఆ తరువాత రాజ్యాంగం రూపొందించుకొని 60 ఏళ్లు అవుతున్న సందర్భంగా 60 మీటర్ల పొడవైన బ్యానర్ పై సమైక్యాంధ్రులతో సంతకాల సేకరణ చేపట్టారు. కాగా గణతంత్ర దినోత్సవం నాడు ఒక రాష్ట్ర జెండాను ఆవిష్కరించడం వివాదాస్పదమౌతోంది. తెలంగాణ రాష్ట్ర జెండాను ఆవిష్కరించడంపై విజయవాడ ఎంపీ ఏకంగా ప్రధానికి లేఖ రాశారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ఎ.కిశోర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాము ఈవిధంగా జెండాను ఎగురవేశామన్నారు. ఈ నెల 28న జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అది సమైక్యాంధ్రాకు అనుకూలంగా వుండేలా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చూడాలని కిశోర్ కోరారు. ఒకవేళ వ్యతిరేక నిర్ణయం వెలువడితే సీమాంధ్ర ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా వుండాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్లు బి.కాంతారావు, గోవింద్, శర్మ, సీతారామ్ పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి