న్యూఢిల్లీ: ఆరేడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పుడుతుందని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యులు ఆర్ దామోదర్ రెడ్డి, కె. జానా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన వెలువరించిన తర్వాత వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసమే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తోందని వారు చెప్పారు. తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి సంయమనం పాటించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వానికి జెఎసి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసిందని, ప్రభుత్వం చేసిన ప్రకటనకు విశ్వసనీయత ఉందని, దాన్ని విశ్వసించాలని వారన్నారు.
రాష్ట్రంలో ఆందోళనలు చేయకూడదని వారు కోరారు. తెలంగాణేతర ప్రాంతాల రాజకీయ నాయకులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసమే కమిటీ వేస్తున్నారని, అందువల్ల డెడ్ లైన్లు కూడదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. కేంద్రం వేసేది తెలంగాణపై కమిటీ కాదని, తెలంగాణ కోసం కమిటీ అని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందనేది నిజం కాదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి