హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో జెఎసి గానీ మరేదైనా గానీ అప్రస్తుతమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కమిటీ ఏర్పాటైన తర్వాత దాని స్వరూప స్వభావాలు చూసిన తర్వాతనే ఏదైనా కార్యక్రమం ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ జెఎసి తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీపై ఎప్పుడూ విమర్శలు చేయలేదని ఆయన అన్నారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఆదేశాలు తెలంగాణకు మాత్రమే కాకుండా సీమాంధ్రకు కూడా వర్తిస్తాయని ఆయన అన్నారు.
వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనలో ఎక్కడా తెలంగాణ అనే మాట లేదని, ఇటీవల తెనాలిలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో సోనియాపై విమర్శలు చేయడంతో మొయిలీ ఆ ప్రకటన ఇచ్చి ఉంటారని ఆయన అన్నారు. అందువల్ల మొయిలీ ప్రకటన సీమాంధ్ర జెఎసిని ఉద్దేంచి చేసిందనే తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి ప్రకటన ఎప్పుడైనా రావచ్చునని, వారమైనా పట్టవచ్చు, ఇవాళ్లో రేపో కూడా రావచ్చునని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి