హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన తర్వాతనే ఏమైనా మాట్లాడుతామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై వేసే కమిటీ స్వరూప స్వభావాలు చూసిన తర్వాత తాము మాట్లాడుతామని ఆయన అన్నారు. కాంగ్రెసు జెఎసిలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై జెఎసి నాయకత్వం వహిస్తున్న తమ పార్టీ నేతలు చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణపై కమిటీ వేసే దాకా తెలంగాణ జెఎసిలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై కూడా తాను మాట్లాడబోనని ఆయన చెప్పారు.
తెలంగాణకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యుపిఎ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పారు. తామంతా కలిసే ఉన్నామని, తాము పార్టీ పటిష్టతకే పని చేస్తామని, సోనియా నాయకత్వాన్ని బలపరుస్తామని, అందుకు భిన్నంగా వ్యవహరించబోమని, ఈ విషయాన్ని తాము ముక్తకంఠంతో చెబుతున్నామని ఆయన అన్నారు. తాము పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని, ధిక్కరించే వారు కాంగ్రెసు కార్యకర్తలే కారని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి