హైదరాబాద్: నక్సల్స్ బాధితులకు ఇచ్చే సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నక్సల్స్ చేతిలో మరణించిన కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై వేసిన మంత్రి వర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమైంది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, శ్రీధర్ బాబు, డిజిపి గిరీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నక్సల్స్ దాడిలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి ఉప సంఘం నిర్ణయించింది. ఒక వేళ ఉద్యోగానికి అర్హులైనవారు కుటుంబంలో లేకపోతే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తారు. బలిమెల ఘటనలో మరణించిన తొమ్మిది మంది పోలీసు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి