హైదరాబాద్: ప్రజలతో ఆటలాడుకోవద్దని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం కలగడం లేదని ఆయన అన్నారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమిటీపై నమ్మకం లేకపోవడంతో ప్రజలు ఆ అంశంతో సంబంధం లేనివారిపై కూడా దాడులు చేస్తున్నారని, ఒత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. దీంతో లాఠీచార్టీలు జరుగుతున్నాయని, సమస్య పరిష్కారానికి లాఠీచార్జీలు పరిష్కారం కాదని ఆయన అన్నారు.
తెలంగాణలో ఆత్మబలిదానాలను నివారించడానికి, దాడులను ఆపడానికి ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, వేసిన కమిటీ స్పష్టతను ఇవ్వడం లేదని, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని, ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని ప్రజలను నమ్మించడానికి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి