న్యూఢిల్లీ: రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఆ ప్రాంతానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను ఘెరావ్ చేశారు. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద వారు కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డిలను ఘెరావ్ చేశారు. పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులకు సర్దిచెప్చేందుకు ఆ ఎంపీలు ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నక్సలైట్లున్నారనే ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తాము చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తున్నామని మందా జగన్నాథం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే పదవులను వదులుకోవడమే కాదు, దేనికై సిద్ధమేనని ఆయన అన్నారు.
ఎన్సీపి నేత శరద్ పవార్ తెలంగాణకు వ్యతిరేకంగా లేరని, తెలంగాణకే కాకుండా విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఎన్సీపి మద్దతిస్తోందని, పార్టీపరంగా నిర్ణయం తీసుకుందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. 2010లో తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే పదవులనే కాదు, దేన్నైనా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తమ పద్దతిలో తాము తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి