హైదరాబాద్: స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తమ సభ్యులను ఏ భాషలో తిడితే వారు అదే భాషలో తిరిగి తిడతారని ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో స్పీకర్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు. సభలో ప్రతిపక్షం విఫలమైందని వ్యాఖ్యానించే అధికారం స్పీకర్ కు లేదని ఆయన అన్నారు. సభను నడపడం వరకే స్పీకర్ బాధ్యత అని ఆయన అన్నారు.
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, వద్దా అనే విషయాన్ని స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్నా మించిన అనుభవజ్ఞులు తమ పార్టీలో ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పెచ్చు మీరిందని ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం జీవోలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ కు నీటిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.