మహబూబ్ నగర్: తెలంగాణకు ఏకాభిప్రాయ సాధనే శరణ్యమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఎందుకు నోరు మెదపలేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాము రాజకీయ సంక్షోభం సృష్టించడానికి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉప ఎన్నికల కోసం కాదని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసిలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ లోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని ఆయన జోస్యం చెప్పారు.