హైదరాబాద్: రాష్ట్రంలో సమైక్యవాదం వెనకబడుతోందని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ అన్నారు. అందుకు కాంగ్రెసు రాయలసీమ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యవాదం నినాదం ఇవ్వకుండా ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలు జరుగుతున్నట్లు జెసి ప్రకటన తెలియజేస్తోందని ఆయన అన్నారు.
జెసి దివాకర్ రెడ్డి ప్రకటనపై జెఎసిలో చర్చించి స్పందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో ఒక స్పష్టతను తీసుకు రావాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీదనే ఉందని ఆయన అన్నారు. జెసి దివాకర్ రెడ్డి ప్రకటనపై అందరి సలహాల మేరకే ఒక నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఐటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా జెసి దివాకర్ రెడ్డి ప్రకటనను ఆహ్వానించారు.