హైదరాబాద్: వైయస్ తర్వాత సిఎం అయిన రోశయ్య మొదట్లో వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు నిలదొక్కుకుని సిఎంగా మొదటి జన్మ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునారు. కొణిజేటి రోశయ్య 78వ పుట్టిన రోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. మంత్రులు, కాంగ్రెసు నేతలు, అభిమానులు, చిన్నారులు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి రావడంతో అంతా కోలాహలంగా మారింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేదపండితులు రోశయ్యకు వేద మంత్రోచ్ఛారణతో శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెసు కార్యకర్తలు 78 కేజీల కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.