• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చితక బాది విమానమెక్కించి బాబు బృందాన్ని పంపించేశారు

By Pratap
|

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బృందం మంగళవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. బాబ్లీ ప్రాజెక్టును చూపిస్తామంటూ మాయోపాయంతో అరెస్టుచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, మళ్లీ అదే నీతి ప్రదర్సిస్తూ జైలుకని చెప్పి వారిని ఔరంగాబాద్‌ నుంచి విమానం ఎక్కించి పంపించేసింది. మహారాష్ట్ర పోలీసులు దాష్టీకానికి పలువురు తెలుగుదేశం నాయకులకు గాయలయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌, పార్టీ సీనియర్లు, వేల మంది కార్యకర్తలు, పలువురు సినీ నటులు, దాదాపు అందరి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని నేతల రాకకోసం ఎదురుచూశారు. విమానం దిగిన వారిలో అశోక్‌గజపతిరాజు, మండవ వెంకటేశ్వర రావు, వేణుగోపాలాచారి, రామునాయుడు, అబ్దుల్‌గని, టీవీ రామారావు, గంగుల కమలాకర్‌, జోగురామన్న, రామకృష్ణలు వీల్‌ ఛైర్‌లో బయటకు వచ్చారు. వీరితో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌లో సరాసరి కేర్‌ ఆస్పత్రికి వెళ్లి చేరారు. చంద్రబాబు కూడా కేర్‌ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. బస్సు యాత్రకు వెళ్లే ముందు రింగులు, వాచీలు గొలుసులు, డబ్బు, సెల్‌ఫోన్‌లతో బయలుదేరిన నేతలంతా తిరిగొచ్చేటప్పుడు బోసి మెడలు, ఉత్త చేతులతో వచ్చారు. మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జితో పాటు తమను నిలువుదోపిడీ కూడా చేసేశారని వీరు వాపోయారు.

మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై తమ పోరాటాన్ని ఆపేదిలేదని అంతకు ముందు చంద్రబాబు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26న ప్రధాని వద్దకు అఖిలపక్షంలో భాగంగా వెళ్లేంతవరకూ పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగించాలని టిడిపి నిర్ణయించింది. ధర్మాబాద్ నుంచి తెలుగుదేశం నాయకులను ఏ జైలుకు తరలిస్తున్నారనే అనుమానాల మధ్య మహారాష్ట్ర పోలీసులు తెలుగుదేశం నాయకులు ఔరంగాబాద్ విమానాశ్రయానికి తరలించారు. బలవంతంగా హైదరాబాద్‌ విమానం ఎక్కించి పంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెదేపా బృందంపై కేసుల్ని ఉపసంహరించింది. కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాబాద్‌ కోర్టులో పోలీసులు అఫిడవిట్‌ దాఖలుచేశారు. ఇక వీరందరినీ తరలించడానికి పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.

చంద్రబాబు సహా ఆ బృందం విమానాశ్రయం రన్‌ వే ప్రాంతంలో ధర్నాకు దిగారు. పోలీసులు బలవంతంగా నేతలను లేపడానికి ప్రయత్నించినా అలాగే కూర్చుండిపోయారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి, మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారనే ఆందోళనతో తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్లాలని, లేకపోతే వెళ్లే ప్రసక్తిలేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయాన శాఖ అధికారులను పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చోబెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనానికి తీసుకెళ్లాలని ముక్తకంఠంతో డిమాండ్ ‌చేసినా పోలీసులు స్పందించలేదు. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ‌ఆఫ్‌ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X