హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై: సోనియా గాంధీపై కాంగ్రెసు నేతల ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ ఉప ఎన్నికల్లో పార్టీ కంగు తినడంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు సోనియాపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే గ్రహింపునకు వచ్చారు. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేవరకు ఆగరాదని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ సీనియర్లు, ఎంపీలు, మంత్రులు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ అనుకూలమని అధిష్ఠానం ద్వారా వెంటనే శ్రీకృష్ణ కమిటీకి చెప్పించాలని భావిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు డీఎస్‌ వద్ద మంత్రులు, ఎంపీలు, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు కె.కేశవరావు వద్ద సీనియర్‌ నేతలు ఆదివారం చర్చలు జరిపారు.

అధిష్ఠానం ముందు ఎన్నికల ఫలితాలను విశ్లేషించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పాలని కాంగ్రెసు తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. తమ వాదనను అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు. ప్రజల భావోద్వేగాలను, పార్టీ మనుగడను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలంటూ ఇప్పటికే కొందరు బయటపడి డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధిష్ఠానం కళ్లు తెరవాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు జి.వెంకటస్వామి హెచ్చరించగా, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికి బట్ట కట్టాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే పదవులను వదిలి ఉద్యమిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉందని శ్రీకృష్ణ కమిటీకి అధిష్ఠానంతో చెప్పిస్తే తెలుగుదేశం సహా అన్ని పార్టీలపై ఒత్తిడి పెరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒకటి రెండు రోజుల్లో పలువురు నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో సమావేశమై, కలసికట్టుగా అధిష్ఠానాన్ని కలవనున్నారు. రాష్ట్ర మంత్రులు, సీనియర్లు విడివిడిగా ఢిల్లీకి వెళ్తారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో పార్టీ పెద్దలందర్నీ కలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్య నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, వీరప్ప మొయిలీలను కలిసే అవకాశం ఉంది. సీడబ్ల్యుసీ సభ్యుడైన కేశవరావు సోనియాగాంధీని నేరుగా కలిసి పరిస్థితిని వివరిస్తారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కూడా రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తారు. ఎన్నికల ఫలితాలపై చర్చించి, తెలంగాణలో పరిస్థితులను వివరిస్తారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని చెప్పినా జనం విశ్వసించలేదని ఆయన నివేదించనున్నారు. పీసీసీ సోమవారం సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, నివేదిక రూపొందించి అధిష్ఠానానికి సమర్పించనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X