నాగం జనార్దన్ రెడ్డిపై మీడియా, పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారా?
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తాను పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తాకథనాలపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని పత్రికలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు కోవర్టులుగా పని చేస్తున్నాయని, ఆ పత్రికలే తాను టిడిపి నుంచి బయటకు వస్తున్నట్లు వార్తలు రాశాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కనీసం తనను అడగకుండా ఏకపక్షంగా వార్తాకథనాలు ప్రచురించారని ఆయన అన్నారు. పార్టీలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర నాయకులు సమష్టిగా నిర్వహించారని, తెలంగాణ ఉద్యమం అలా లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ జెఎసి నిర్ణయం మేరకే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తాము రాజీనామాలు చేసినా, శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పే చేశామని ఆయన అన్నారు.