వరుణ సందేశం: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌కు హెచ్చరిక!
వేసవి తీవ్రత, విపరీతమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం ఎట్టకేలకు ఒక శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి విజయవంతంగా ప్రవేశించి, కేరళ తీరాన్ని బలంగా తాకాయి. దీని ప్రభావంతో అటు కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా దట్టమైన మేఘాలు తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో రుతుపవనాల రాక
ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల్లో రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతుండటంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిపోనుందని అధికారులు స్పష్టం చేశారు. రుతుపవనాల రాకతో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి.

ఈ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు
గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు ప్రారంభం కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
నిన్న రాష్ట్రంలో ఈ జిల్లాలలో వర్షాలు
వాన పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిజానికి బుధవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని హన్మకొండ, నర్సంపేట, పరకాల, హసన్ పర్తి ప్రాంతాలతో పాటు ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చాయి.
నేడు హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఛాన్స్
రాబోయే 24గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని, గాలిలో తేమశాతం 42శాతంగా నమోదు కావచ్చని అధికారుల అంచనా. మహానగరమైన హైదరాబాద్‌లో సైతం గురువారం సాయంత్రం వేళల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, పటాన్‌చెరు, లింగంపల్లి, తెల్లాపూర్, దమ్మాయిగూడ వంటి ప్రాంతాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది.
సాయంత్రం హైదరాబాద్ వాసులకు అలెర్ట్
సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున, వాహనదారులు, నగరవాసులు వాతావరణ పరిస్థితులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించి, రాష్ట్రవ్యాప్తంగా వేసవి తాపం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications