కేశవరావుకు అవకాశం: దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రమోషన్?

ఈసారి బీసీలకు పదవీ యోగం లభిస్తుందనే నమ్మకాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కె.కేశవరావు, మరో సీనియర్ నేత వి.హనుమంతరావులు తమకు పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. వీరిద్దరికీ అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వరుసగా రెండోసారి ఎంపీ అయిన మధుయాష్కీ కూడా ఈసారి తనకు అవకాశం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈయన తొలి నుంచి పార్లమెంటులో రాహుల్‌గాంధీ బృందంతో కలిసి ఉంటున్నారు. మంత్రివర్గంలో యువతకు మరింత అవకాశం ఇవ్వాల్సి ఉందని స్వయంగా ప్రధాని మన్మోహనే ప్రకటించిన నేపథ్యంలో యాష్కీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రెండోసారి గెలిచిన సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కూడా దక్షిణాది నుంచి ఒక ప్రధాన వర్గానికి అవకాశం ఇచ్చేలా తన పేరు పరిగణనలోకి తీసుకోవచ్చుననే ఆశతో ఉన్నారు.
వరుసగా రెండోసారి గెల్చిన సర్వే సత్యనారాయణ సోనియా విధేయతే తనకు పదవి కట్టబెడుతుందని ధీమాగా ఉన్నారు. తెలంగాణలోని మిగిలిన లోక్‌సభ సభ్యులంతా కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికైన వారే. మందా జగన్నాథ్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు తెలుగుదేశం పార్టీ తరపున గతంలో ఎంపీలుగా ఉన్నారు. తొలిసారి ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ సాధారణంగా మంత్రి పదవులు ఇవ్వడం లేదు. కోస్తా నుంచి కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, హర్షకుమార్‌లు పోటీలో ఉన్నారు. మంత్రి పదవులకు సంబంధించి తమను పక్కన పెట్టడంపై కావూరి, రాయపాటిలు గతంలో ఒకసారి బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. కిశోర్ చంద్రదేవ్‌కు ఢిల్లీలో పార్టీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో ఆయన పేరు లోక్‌సభ స్పీకర్ పదవికి ప్రతిపాదనకు వచ్చినా చివరి క్షణంలో అవకాశం చేజారిపోయింది. ఇక రాజ్యసభ సభ్యుల్లో నంది ఎల్లయ్య, టి.సుబ్బిరామిరెడ్డిలు కూడా పదవి ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications