తెలంగాణ లాయర్ల ఎఫెక్ట్: హైకోర్టు జస్టిస్ రాజీనామా

గురువారం మధ్యాహ్నం జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కోర్టు హాలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదుల మధ్య వివాదం మొదలైంది. దీంతో పలువురు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కోర్టుకు వెళ్లి న్యాయవాదులతో చర్చించి రాజీ చేశారు. ఈ పరిణామం అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రాజీనామా లేఖను ప్రధాన న్యాయమూర్తికి పంపి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో కూడా పాల్గొనలేదు. జస్టిస్ నాగార్జునరెడ్డి రాజీనామా పత్రాన్ని ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ పూర్తిగా చదివి వినిపించారు. ఇక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ నౌషద్‌అలీలతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయడానికి న్యాయమూర్తులందరూ ఏకగీవ్రంగా అంగీకరించినట్లు తెలిసింది.
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూతోపాటు పలువురు జస్టిస్ నాగార్జునరెడ్డిని కోరినట్లు తెలిసింది. నిర్ణయం ఉపసంహరణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఆయన మనస్సు మార్చుకోలేదని తెలిసింది. రాజీనామాను అంగీకరించడంలేదని, శుక్రవారం యథావిధిగా కోర్టుకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications