వైయస్ మామ రవీంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో దాక్కున్నారు: నారాయణ

వైయస్ బావమరిది కాబట్టే కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇవ్వాళ కోట్లకు పడగలెత్తాడని, ఆయనతో పాటు వైయస్ అనుయాయులు, బంధువులు రాష్ట్రాన్ని కొల్లగొట్టి కోట్లు గడించారని నారాయణ అన్నారు. అన్నదాతల పొట్టగొట్టి అక్రమంగా ఎరువులను తరలిస్తున్న మేయర్ వెంటనే రాజీనామా చేయాలని, పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి అనుయాయులు, బంధువులు ఆయన హయాంలో భారీగా ఆస్తులు కూడబెట్టుకొని తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఇప్పుడు రవీంద్రనాథ రెడ్డిని వెనకేసుకు వస్తున్నారని విమర్శించారు. రైతుల కడుపు కొడుతున్న రవీంద్రనాథరెడ్డిని పోలీసుల నుండి కొందరు మంత్రుల వరకు రక్షిస్తున్నారన్నారు. ఇక్కడ మేయరు అక్రమాలు బయటపడుతుంటే ఆయన మాత్రం రాష్ట్రాన్ని వదిలి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సాయిప్రతాప్ ఇంట్లో దాక్కున్నారన్నారు. రాష్ట్రంలో 20 ఎరువుల ప్లాంట్లు ఉంటే అందులో రవీంద్రనాథ్ వి నాలుగు కాగా కోటాలో ఆయనకు మాత్రం సగం ఇచ్చారన్నారు. ఏ రాజకీయ చరిత్ర లేని రవీంద్రనాథ్ రెడ్డికి వైయస్ బావమరిది కావడమే కలిసి వచ్చిందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఒక జీవచ్ఛవంలా తయారయ్యాడని, కేవలం సమావేశాలు జరిపి ఎరువుల కొరత తీరుస్తామని చెప్పడం తప్పితే ఆయన రైతులకు చేసిందేమీ లేదన్నారు. కాన్ఫరెన్సులు, అక్రమార్కులకు అండగా కాకుండా రైతుల సమస్య తీర్చేందుకు ఆయన కృషి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొన వలసి ఉంటుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రోశయ్య వెంటనే స్పందించాలని, లేకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోశయ్య అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకు వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications