వరంగల్: వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమారం తండాలో తండావాసులు నలుగురు దొంగలను చితకబాదారు. గురువారం అర్ధరాత్రి సమయంలో 9మంది దొంగలు పోలీసుల వేషంలో తండాకు వచ్చారు. వారు పోలీసులు కాదని, దొంగలే అని గమనించిన ప్రజలు వెంటనే వారిని లాక్కెళ్లి స్తంభానికి కట్టివేశారు. అందులో నలుగురు మాత్రమే వారికి దొరికారు. మిగిలిన వారు వెంటనే కాళ్లకు బుద్ది చెప్పారు. దొరికిన నలుగురు దొంగలను స్తంభానికి కట్టివేసి బాగా చితకబాదారు. తెల్లవారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆ దొంగలను అప్పగించవల్సిందిగా కోరారు. అయితే తండావాసులు పోలీసులకు వారిని అప్పగించడానికి ససేమీరా అన్నారు. ఎస్ ఐ వారితో మాట్లాడినప్పటికీ వారు వినలేదు. తమ తండాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే వారిని అప్పగిస్తామని అన్నారు. దీంతో ఎస్ఐ వారికి తండాకు రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో తండావాసులు ఆ దొంగలను పోలీసులకు అప్పగించారు.