తిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి గల్లా అరుణాకుమారి ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో తీవ్ర అపచారం చేశారు. తిరుమలలోని వసంత మండపంలో శుక్రవారం అఖండ వేదపారాయణం, వసంత పారాయణానికి ముఖ్యమంత్రితోపాటు గల్లా అరుణకుమారి వచ్చారు. అయితే ఆమె చెప్పులతోనే మండపంలోనికి రావటంతో సిబ్బంది వారించారు. అయినా ఆమె వినలేదు. మంటపంలోనే చెప్పులు విడిచారు. సిబ్బంది అక్కడ విడవద్దని అది అపచారం అవుతుందని చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోక పోవటం శోచనీయం. అంతకుముందు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య తిరుమల వేంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో దిగిన రోశయ్యకు భారీ సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ సభ్యులు స్వాగతం పలికారు.