తెలంగాణపై వైయస్ ది తప్పైతే, సోనియాదీ తప్పేనన్న అంబటి

రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితిలో ఉందని అంబటి వ్యాఖ్యానించారు. 'మంత్రివర్గ విస్తరణ లేదు. పీసీసీ పునర్వ్యవస్థీకరణ జరగదు. కార్యకర్తలకు కార్పొరేషన్ పదవులిచ్చేదిలేదు.. యువజన కాంగ్రెస్ కార్యవర్గాల రద్దు. ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో పార్టీ ఉంది" అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరారు. వైఎస్‌ను తెలంగాణ వ్యతిరేకిగా కె.కేశవరావు వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు. వైఎస్ ఉండగా ఈ మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడుగా కేకే ఉండగా అధిష్టానాన్ని ఒప్పించి ఎందుకు తెలంగాణ తేలేదన్నారు. వైఎస్‌కు అన్ని ప్రాంతాల్లో అభిమానులున్నారనీ తెలంగాణలోనూ జగన్ ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పారు.
తెలంగాణ కావాలంటూ ఢిల్లీలో టీడీపీ ధర్నా చేయడం నాటకమని అంబటి అన్నారు. తెలంగాణ కోసం టీడీపీ ఏం చేసినా అక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విశ్వసించరన్నారు. బాబు మద్దతుతో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉండగా మూడు రాష్ట్రాలిచ్చి, తెలంగాణనూ ఇవ్వాలనుకుంటే అడ్డుపడ్డారన్నారు. టీడీపీ వల్లే తెలంగాణ ఇవ్వలేక పోయామని బీజేపీ నేత అద్వానీ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అలాంటి బాబు ఇపుడు తెలంగాణ కావాలని ధర్నా చేస్తే నమ్ముతారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications