న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు బంగారు గొలుసును బహూకరించారు. తన మెడలోని గొలుసును తీసి ఇస్తే తీసుకుంటారో లేదో అనుకున్నానని, దాన్ని ఒబామా తీసుకోవడం ఆనందంగా ఉందని రాయపాటి అన్నారు. ఆ గొలుసు విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. పార్లమెంటులో ఒబామా ప్రసంగం సందర్భంగా రాయపాటి దాన్ని బహూకరించారు. ఒబామా పార్లమెంట్ సెంట్రల్ హాలు ప్రసంగానికి రాష్ట్రానికి చెందిన మెజారిటీ పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కే చంద్రశేఖర్‌రావు అందరికన్నా ముందుగానే వచ్చి రెండో వరుసలో డీఎంకే నేతలు రాజా, బాలుల మధ్య కూర్చున్నారు. ఆలస్యంగా వచ్చిన రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, పొన్నం ప్రభాకర్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు మాత్రం చివరి వరుసలో నిలుచోవాల్సి వచ్చింది. అయితే అది వారి మంచికే అయింది. ఒబామా ప్రసంగం తర్వాత వెళుతూ వారితో కరచాలనం చేశారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు కూడా ఒబామాతో కరచాలనం చేశారు. రాహుల్ గాంధీతో ఒబామా కరచాలనం చేశారు. సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి ఎర్రకోటు ధరించి సెంట్రల్ హాలులో తిరగడం అందర్నీ ఆకట్టుకుంది. ఒబామా ప్రసంగం అద్భుతంగా ఉన్నదని కేసీఆర్ అన్నారు. ఒబామా హామీ ఇచ్చిన రీతిగా భద్రతా మండలిలో భారత్‌కు స్థానం లభిస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చునని చెప్పారు.