రామోజీరావు ఈనాడు దినపత్రిక వార్తపై కెసిఆర్ మండిపాటు

తెలంగాణ కోసం జరుగుతున్నది ప్రజల ఉద్యమమని, దాన్ని వ్యక్తులకు కట్టబెట్టి గాలి వార్తలు రాయడం మంచిది కాదని ఆయన అన్నారు. తప్పుడు వార్తలు రాసినప్పుడు ఖండించే హక్కు కూడా తమకు ఉంటుందని ఆయన చెప్పారు. తప్పుడు వార్తలు రాయవద్దని తాను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని, గురువారంనాడు కూడా తాను విజ్ఞప్తి చేశానని, అయినా వక్రీకరించి రాశారని ఆయన అన్నారు. కాంగ్రెసును బలపరుస్తామని చెప్పామని, తాను మాట్లాడిన సందర్భమేమిటి, మీరు అడుగుతున్నదేమిటని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. ఈనాడు దినపత్రికలో వక్రీకరించి రాయడాన్ని యాజమాన్యం దృష్టికి తెస్తానని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ను ఆయన శుక్రవారం మధ్యాహ్నం పార్టీ నేత వినోద్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ లతో పాటు కలిశారు. దుగ్గల్ కు తాము అన్ని విషయాలు చెప్పామని ఆయన అన్నారు. దుగ్గల్ తో మాట్లాడిన విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగితే అక్కడ చెప్పిన విషయాలన్ని మీకు చెప్పాలా అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఓ సందర్భంలో దిక్కుమాలిన వార్తలు రాస్తారు, వాటికి జవాబు ఇవ్వాలా అని ఆయన అడిగారు. డిసెంబర్ 30 లేదా 31వ తేదీల్లో నివేదిక ఇస్తామని దుగ్గల్ తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభేదాలు ఉండవచ్చు, గద్దర్ కెసిఆర్ తో కలిసి పనిచేస్తానని చెప్పారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన మీడియాను విమర్శించారు. అనేక దుష్ప్చచారాలతో, గాలి వార్తలతో కెసిఆర్ ను దెబ్బ తీయాలని ప్రయత్నించారని, తన జీవిత ధ్యేయం తెలంగాణ రాష్ట్ర సాధన అని, వ్యూహాత్మకంగా సందర్భాన్ని బట్టి ఎత్తుగడలు వేసుకుంటామని, తనపై వార్తలకు బాధపడేది కూడా లేదని, అన్ని పత్రికలకు దీటుగా నమస్తే తెలంగాణ వస్తుందని, తెలంగాణ వ్యతిరేక వార్తలకు సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications