సనత్ నగర్ టిమ్స్ లో పూర్తిస్థాయి వైద్యసేవలు ఎప్పుడంటే!
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్ నగర్ టిమ్స్ త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తికాగా, ట్రయల్ రన్ నిర్వహించి లోటు పాట్లను సరి చేస్తుంది. ఆస్పత్రి ప్రారంభం నుండే ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా రోగులకు మెరుగైన వైద్యం అందాలని ఆ దిశగా కృషి చేస్తుంది.
టిమ్స్‌లో ట్రయల్ రన్, ఏర్పాట్లపై వైద్యారోగ్య శాఖా మంత్రి
ఈ క్రమంలో సనత్ నగర్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పూర్తిస్థాయి వైద్యసేవలను అందించటం కోసం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. టిమ్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యసేవల ట్రయల్ రన్, ఆస్పత్రిలోని మౌలిక వసతులు, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు, వివిధ విభాగాల సంసిద్ధత తదితర అంశాలపై తాజాగా మంత్రి సమీక్షించారు.

దేశంలోనే అత్యాధునిక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్య సంస్థలలో ఒకటి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టిమ్స్‌ను దేశంలోనే అత్యాధునిక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్య సంస్థలలో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ ప్రారంభించిన మొదటి రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రతి విభాగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ట్రయల్ రన్‌లో భాగంగా గుర్తించిన అన్ని లోపాలను సరిదిద్దాలని సూచించారు.
టిమ్స్ లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణ
ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్ సేవలు, ల్యాబొరేటరీలు, ఫార్మసీ, సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్, రోగుల రిజిస్ట్రేషన్, ఐటీ వ్యవస్థలు తదితర అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. రోగులకు నిరంతరాయ సేవలు అందించేందుకు విద్యుత్, నీటి సరఫరా, ఆక్సిజన్ లైన్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, భద్రత తదితర సహాయక వ్యవస్థలన్నీ అత్యున్నత ప్రమాణాలతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
టిమ్స్ సిబ్బంది, నియామకాలపైన మంత్రి దిశా నిర్దేశం
అన్ని విభాగాలకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచి, హాస్పిటల్ ప్రారంభం నుంచే సమర్థవంతంగా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టిమ్స్ కోసం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా, వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో టిమ్స్‌ను అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు.
నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేలా టిమ్స్
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, అవయవ మార్పిడి సేవలు, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్ రంగాల్లో టిమ్స్ దేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వ వైద్య సంస్థగా నిలుస్తుందన్నారు.టిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా నిమ్స్, గాంధీ, ఉస్మానియా తదితర ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, ప్రజలకు మరింత వేగంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications