వైయస్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి: కాంగ్రెసు 125 ఉత్సవాలలో దిగ్విజయ్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసిసి నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దివంగత ప్రధాని జవహర్ లాలు నెహ్రూ చేపట్టిన ఆర్థిక విధానాలవల్లే 50 సంవత్సరాల తర్వాత కూడా భారత్ అర్థికమాంద్యంనుండి విజయవంతంగా బయటపడగలిగిందన్నారు. అమెరికా వంటి అగ్ర దేశాలే మాంద్యం నుండి బయటపడలేకపోయాయన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశం అభివృద్ధి చెందిన దేశం అనటం వెనుక కాంగ్రెసు విధానాలే ఉన్నాయన్నారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకోసం పని చేసే పార్టీ కాంగ్రెసు ఒక్కటేనని అని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. కొందరు కాంగ్రెసు అధినేత్రి సోనియాగాంధీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అర్హత కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందని,ఆ అర్హత మిగిలిన ఏ పార్టీకి ఉందని ఆయన ప్రశ్నించారు. భారతదేశం మొత్తం ఆమోదించినప్పటికీ సోనియాగాంధీ ప్రధాని పదవిని తృణపాయంగా వదులుకొని త్యాగమయి అయిందన్నారు. అలాంటి వ్యక్తిపై సుదర్శన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. జ్యోతిబసు వంటి కమ్యూనిస్టు నేతలు కూడా సోనియాను ప్రధాని పదవి చేపట్టమన్నప్పటికీ ఆమె సున్నితంగా తిరక్సరించిందన్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెసు కు జవసత్వాలు ఇచ్చాడని రోశయ్య అన్నారు. కాంగ్రెసు అంటే భారత దేశం, భారతదేశం అంటే కాంగ్రెసు అన్నారు.
కుల, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు దేశంలో జరుగుతున్ాయని వాటిని ప్రజలు తిప్పికొట్టాలని పిసిసి సారధి డి శ్రీనివాస్ సూచించారు. దేశం కోసం ఏ ఒక్కరో పుడతారని, అలాగే గాంధీ, నెహ్రూ కుటుంబం కేవలం దేశం కోసమే పుట్టిందన్నారు.శాంతిని కోరుకునే వారందరూ కాంగ్రెసు కు దన్నుగా నిలవాలని డిఎస్ అన్నారు. కాంగ్రెసు ను బలహీనం చేయడానికి ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. సుదర్శన్, సోనియాగాంధీపై వ్యాఖ్యలు చేసినప్పుడు దేశం యావత్తు ఆమెకు మద్దతు పలికిందని అన్నారు.












Click it and Unblock the Notifications