పంజాబ్‌లో హైఅలర్ట్.. ఆ ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపులు !
పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌తో తీవ్ర అలజడి చెలరేగింది. మెయిల్ అందిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా బాంబులతో పేల్చివేస్తామని ఈమెయిల్‌లో బెదిరించినట్లు అధికారులు న్యూస్18 ఇంగ్లీష్‌కి తెలిపారు.
1984 జూన్‌లో స్వర్ణ దేవాలయం నుండి ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన 'ఆపరేషన్ బ్లూ స్టార్’ వార్షికోత్సవానికి కేవలం రెండు రోజుల ముందు ఈ బెదిరింపులు రావటం విశేషం. ఈ మెయిల్‌లో ఆ వివాదాస్పద సైనిక చర్యకు సంబంధించిన రెచ్చగొట్టే అంశాలున్నాయని అధికారులు వివరించారు.

ఈ బెదిరింపుల నేపథ్యంలో, జలంధర్‌లోని ప్రముఖ 'దేవీ తలాబ్ మందిర్' సహా పలు దేవాలయాల వద్ద పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభ్యం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించే లక్ష్యంతో కొందరు ఆకతాయిలు ఈ మెయిల్ పంపి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఎలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గత కొన్ని వారాల్లో ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. గత బెదిరింపులన్నీ తప్పుడువని తేలినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని కూడా విస్మరించడం లేదు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' వార్షికోత్సవం దృష్ట్యా ఇప్పటికే రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేయగా, దేవాలయాలకు వచ్చిన ఈ బెదిరింపులు స్థానికంగా ఆందోళన రేకెత్తించాయి.












Click it and Unblock the Notifications