ఒక్క రోజే 16 మంది రైతులు మృతి: జగన్ సాక్షి డైలీ రిపోర్టు

లైలా, జల్ తుఫాన్‌లు, ఆకస్మిక వర్షాలు, వాటివల్ల జరిగిన అపార పంటనష్టం, మోయలేని రుణభారం వారి పాలిట శాపాలయ్యాయి. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం ఇందుకు తోడైంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం నల్లవెల్లికి చెందిన నోముల తిరుపతిరెడ్డి (44) రెండెకరాల్లో రెండు బోర్లు వేశాడు. అయినా నీరు సరిపడా రాక వరికి రెండుసార్లు నష్టం వాటిల్లింది. సాగు కోసం చేసిన అప్పులేమో పెరిగిపోయాయి. ఆ మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌కు చెందిన యువ రైతు విజయ్‌కుమార్ (19) రెండెకరాలు కౌలుకు తీసుకుని మిరప, పూల తోటలు వేశాడు. అధిక వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించి అవి కొట్టుకుపోయాయి. దాంతో తీవ్ర వ్యథకు లోనై గురువారం అర్ధరాత్రి అతను పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి శివారు కొత్తూరు వాసి కూరపాటి తిరుపతిరావు (41) 2.25 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వర్షాలకు పంట పూర్తిగా దెబ్బ తినడంతో, అప్పులు తీర్చలేనని భయపడి శుక్రవారం పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం తక్కళ్లపాడుకు చెందిన ఎలుగోయ కుమారస్వామి (50) తన 4 ఎకరాల్లో సగం పత్తి, మరో సగం వరి సాగు చేశాడు. ఇటీవలి తుపాను, అకాల వర్షాల దెబ్బకు పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. దాంతో శుక్రవారం ఉదయం పత్తి చేను వద్దే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల వాసి దాటర్ల వెంకటి (35) ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. దిగుబడి సరిగా లేక, అప్పులు తీరవనే బెంగతో ఆదివారం పురుగుల మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ కాలనీకి చెందిన జూటూరి గోవిందరాజులు (40) నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేశాడు. చేతికంది వచ్చిన పంట వర్షార్పణం కావడాన్ని తట్టుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లాలోని పిడుగురాళ్ల మండలం పెద అగ్రహారానికి చెందిన కౌలు రైతు జంగిటి పుల్లయ్య (50) కూడా వానలకు పంట పాడైపోవడంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామ రైతు తోడేటి బ్రహ్మం (45) తన మూడెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. తుపాన్ దెబ్బకు పంట తుడిచి పెట్టుకుపోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తదితరాలకు తాళలేక శుక్రవారం పురుగుల మందు తాగి మరణించాడు.
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన లూటుకుర్తి సత్యం (55), తుని రూరల్ మండలం తేటగుంట వాసి కొండపు రాజులు (60) పంటలు చేతికి రాక, అప్పులు తీర్చే దారి లేక మనోవేదనకు గురై శుక్రవారం గుండె పోటుతో మరణించారు. పంటలు వర్షార్పణం కావడంతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం మల్లివీడుకు చెందిన కౌలు రైతు శొంఠ్యాన సత్యంనాయుడు (52) గురువారం, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురానికి చెందిన బగాది వెంకటరావు (50) గుండె ఆగి చనిపోయారు.
చేతికొచ్చిన పంటలు వర్షాలకు నేలపాలు కావడం, ధాన్యం మొలకెత్తడంతో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజరకు చెందిన రైతు అడపాల నాగేశ్వరరావు (48), ముష్టిబండకు చెందిన మహిళా రైతు మానికల నాగరత్నం (45), చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లికి చెందిన మహిళా రైతు మారగాని వెంకటనర్సమ్మ (42) శుక్రవారం గుండెపోటుకు బలయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం చినవడ్లపూడి వాసి దావులూరి సాంబశివరావు (58) ఇటీవలి వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి లోనై గుండెపోటుతో మరణించాడు.












Click it and Unblock the Notifications