హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి ఏమీ తెలియదు, జగన్‌ను ప్రజలు క్షమించరు: బాబు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రోజుకో మాట మాట్లాడుతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిరంజీవికి రాజకీయ అవగాహన లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓ రోజు మద్దతిస్తూ మరో రోజు వ్యతిరేకించే చిరంజీవి గురించి ఏం మాట్లాడాలని ఆయన అన్నారు. చిరంజీవికి కృష్ణా ట్రిబ్యునల్ గురించి, ప్రాజెక్టుల గురించి ఏం తెలుసునని, తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. చిరంజీవి మాటలు బాధ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

రైతుల కోసం తాను నిరాహార దీక్ష చేస్తే సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు వైయస్ జగన్ వ్యాఖ్యానించారని, జగన్‌ను ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని వైయస్సార్ దోచుకున్నారని ఆయన అన్నారు. గజనీ, ఘోరీల కన్నా దారుణంగా వైయస్ దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనవరి 6వ తేదీ సమావేశం గురించి కేంద్ర హోం మంత్రి చిదంబరం లేఖ తమకు అందిందని ఆయన చెప్పారు.

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమ, తెలంగాణలో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు వృధా అవుతాయని, కృష్ణా డెల్టా ఎడారిగా మారుతుందని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించిన అక్రమ ప్రాజెక్టులను క్రమబద్ధీకరించిందని, వాటికి న్యాయబద్ధత కల్పించిందని ఆయన అన్నారు.

తాము మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అపహాస్యం చేశారని, ఇప్పుడు దానికి న్యాయబద్ధత చేకూరిందని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో మన ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్డీయె ప్రభుత్వ హయాంలో ఆల్మట్టి ఎత్తును పెంచడాన్ని అడ్డుకున్నామని, ఆల్మట్టి ఎత్తు 519 అడుగులు మాత్రమే ఉండాలని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని, దాని ఎత్తును పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం అన్యాయమని ఆయన అన్నారు.

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టులకు నికర జలాలు అందకుండా పోతాయని ఆయన అన్నారు. కృష్ణానదిలో ట్రిబ్యునల్ 75 శాతం డిపెండెబిలిటీని తీసుకోవాల్సిందని, కేవలం 65 శాతం మాత్రమే తీసుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కృష్ణా టిబ్యునల్ తీర్పుపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

బాబ్లీ ప్రాజెక్టుపై తాము పోరాటం చేస్తే ఆనాడు అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల అపహాస్యం చేశారని, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఈ విధంగా రావడానికి వైయస్ రాజశేఖర రెడ్డే కారణమని ఆయన అన్నారు. 2010 సంవత్సరం దారుణంగా ముగిసిందని, 2011 సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X