తెలంగాణ మంత్రుల ప్రత్యేక బాట, సోనియాను కలవాలని నిర్ణయం

పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణ అంశాన్ని వివరించడం, రచ్చబండ కార్యక్రమంలో ముందుకు ఎలా వెళ్లాలి, మంత్రులందరూ కూడా ఒకే బాటలో నడవటం అన్న అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చాయి. రెండుసార్లు తెలంగాణ ప్రాంత ఎంపీలతో అధిష్ఠానం మాట్లాడిన నేపథ్యంలో మంత్రులుగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. సోనియా అపాయింట్‌మెంట్ కోసం అప్పటికప్పుడు వారు ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ద్వారా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. చివరకు అపాయింట్‌మెంట్ బాధ్యతను మంత్రులు జానారెడ్డి, సారయ్యలకు అప్పగించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేస్తారనే వార్తలపై కూడా సమావేశంలో చర్చించారు. సమావేశం నుంచే జూపల్లితో మంత్రులు మాట్లాడారు. ఒకరిద్దరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని వారన్నట్లు తెలిసింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కలసి కట్టుగానే తీసుకుందామని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సమితి (క్యాఫ్ట్) సమావేశాలకు మంత్రులు వెళ్లనంత మాత్రాన ఉద్దేశాలను అంటగట్టడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. సమావేశం అనంతరం మంత్రులు బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షను తెలియజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications