తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయమే కీలకం, ఫిబ్రవరి మొదటివారంలో భేటీ

ఈ నెల 21వ తేదీన సోనియా, మన్మోహన్ సింగ్‌లతో సమావేశమైన కాంగ్రెసు కోర్ కమిటీ తెలంగాణపై విస్తృతంగా చర్చించింది. అయితే, అఖిల పక్ష సమావేశానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల్లో తెలంగాణపై ఏకాభిప్రాయానికి చిదంబరం కసరత్తు చేస్తున్నారు. దీంతో గణతంత్ర దినోత్సవానికి ముందే జరగాల్సిన అఖిల పక్ష భేటీ వాయిదా పడింది. ఇంతకు ముందు నిర్వహించిన అఖిల పక్ష భేటీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, తెలుగుదేశం గైర్హాజరయ్యారు. ఈ పార్టీ నుంచి ఒక్కరిని మాత్రమే పిలిస్తే తాము వస్తామని తెరాస నాయకులు చెబుతుండగా, బిజెపి శ్రీకృష్ణ కమిటీని తాము అంగీకరించడం లేదని అంటోంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇంకా సంప్రదింపులు అనవసరమని తెలుగుదేశం పార్టీ అంటోంది.
మరో మారు అఖిల పక్ష సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని, ఆ నిర్ణయాన్ని అఖిల పక్ష సమావేశంలో చెప్పాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు చెప్పారు. పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించడం వల్ల సమస్య పరిష్కారం కాదని సిపిఐ, సిపిఎం నాయకులు కూడా అంటున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు నిర్ణయమే కీలకంగా మారింది. దీంతో అఖిలపక్ష భేటీలో జాప్యం జరుగుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications