మాది సినిమా పార్టీ కాదు: కాంగ్రెసులో విలీనం వార్తలపై కెసిఆర్

ప్రస్తుతం టిఆర్ఎస్‌లోకి భారీ వలసలు ఉన్నాయన్నారు. టిఆర్ఎస్ రోజురోజుకు బలపడుతుందన్నారు. బలమైన పార్టీకి మరో పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం లేదన్నారు. మాది ప్రత్యేకమైన ఉద్యమ పార్టీ అన్నారు. సినిమా పార్టీ కాదని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎద్దేవా చేశారు. చిరు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి తెలంగాణపై అధిష్టానం మాటకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. ఆంతేకానీ ఆయన సమైక్య నినాదానికి ఇప్పుడు సంబంధం లేదన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలుస్తుందన్న కెకె వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. కెకె కామెంట్ ఈ సంవత్సరపు ఉత్తమ జోక్ అన్నారు. తెలంగాణ కోసం త్వరలో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. మీడియాకు చేతినిండా వార్తలు ఉంటాయన్నారు.
ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోచంపల్లి, గద్వాలలో సిల్కు బోర్డులుఏర్పాటు చేయాలన్నారు. సిరిసిల్ల ఆకలి చావులపై ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో ఎపి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. మార్చి 9వరకు చేనేత కార్మికులను ఆదుకోకుంటే మార్చి 9న రహదారుల దిగ్బంధం చేస్తామన్నారు. విజయవాడ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. మార్చి 10న తెలంగాణ బంద్ పాటిస్తామని చెప్పారు. మధ్యంతర ఎన్నికలు వస్తే జగన్‌కు ఎక్కువ సీట్లే వస్తాయని, తెరాసకు 53 శాతం బలం ఉందని సర్వేల్లో తేలిందని ఆయన చెప్పారు.